![రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకున్నారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్](https://static.v6velugu.com/uploads/2025/02/mp-laxman-spoke-to-media-at-graduate-and-teacher-mlc-election-voters-meeting-at-kamareddy-district-party-office_mLKE8ZjIck.jpg)
- కామారెడ్డిలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల మీటింగ్
- ఆరు గ్యారంటీల హామీలు ఏమైపోయాయని విమర్శలు
కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల ఆశలు సన్నగిల్లాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసులో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల మీటింగ్లో మీడియాతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీ హామీలు చెల్లని రూపాయిగా మారిపోయాయన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు హైడ్రా, మూసీ నది ప్రక్షాళన.. కుల గణన వంటి అంశాలను తెరమీదకు తెచ్చారన్నారు. 10 ఏండ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక నిధులు, ప్రాజెక్టులు, పథకాలు ఇచ్చిందన్నారు.
వచ్చే ఉగాది నుంచి ఉద్యమబాట
యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి రైల్వేకు రూ. 800 కోట్లు ఇస్తే తాము ఈ బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,700 కోట్లు ఇచ్చామన్నారు.బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయటంతో పాటు, వచ్చే ఉగాది నుంచి పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని, ప్రజల గొంతుకగా పని చేస్తామన్నారు. మండలిలో ప్రజల గొంతుక అయ్యేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలను గెలిపించాలన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజు పాల్గొన్నారు.