
- ఏం జరిగినా వార్ రూంకు సమాచారం ఇవ్వాలి : పార్టీ నేతలతో లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ సూచించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో కలిసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. పార్టీ ముఖ్య నేతలంతా ముందుగానే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
అక్కడ ఏం జరిగినా వెంటనే వార్ రూమ్‌కు సమాచారమివ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే ఎవరు ఏం మాట్లాడాలన్న అంశంపై రాష్ట్ర అధికార ప్రతినిధులకు లక్ష్మణ్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలని, టీవీ డిబేట్లలో పాల్గొనాలని స్పోక్స్ పర్సన్లకు సూచించారు.
కాగా, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం 7 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు.