భాష మార్చుకో.. లేదంటే కేసీఆర్‎కు పట్టిన గతే: CM రేవంత్‎కు MP లక్ష్మణ్ వార్నింగ్

భాష మార్చుకో.. లేదంటే కేసీఆర్‎కు పట్టిన గతే: CM రేవంత్‎కు MP లక్ష్మణ్ వార్నింగ్

కరీంనగర్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోకపోతే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‎కు పట్టిన గతే ఆయనకు పడుతోందని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ కూడా మోడీపై ఇలాగే మాట్లాడారని.. ఇప్పుడు ఆయనకు ఏ గతి పట్టింది అందరం చూస్తున్నామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం (ఫిబ్రవరి 15) కరీంనగర్‎లోని శుభ మంగళ కన్వెన్షన్‎లో  గ్రాడ్యుయేట్, టీచర్స్‎తో బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  ఎంపీ లక్ష్మణ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, పదజాలం విని సభ్యసమాజం తలదించుకుంటోందని అసహనం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి కులాన్ని ఆపాదిస్తు మాట్లాడడం తగదన్నారు. పదేండ్లలో మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణకు రూ.5 వేల కోట్ల రైల్వే ‌నిధులు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేక డకౌట్ అయ్యాడని ఎద్దేవా చేశారు. 

కాగా, శుక్రవారం (ఫిబ్రవరి 14) గాంధీభవన్‎లో కుల గణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని.. అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నానని అన్నారు. సర్టిఫికేట్స్‎లో మోడీ బీసీ కానీ.. ఆయన మనసు అంత బీసీ వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన నివేదికను తప్పు అంటూ మోడీ, కేడీ బీసీలను మో సం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రేవంత్ కామెంట్స్‎పై బీజేపీ నేతలు ఫైర్ అవుతూ కౌంటర్ ఇస్తున్నారు.