న్యూఢిల్లీ, వెలుగు: బీదర్–బోధన్ వయా నారాయణ్‌ఖేడ్–ప్రీతంపూర్ రైల్వే లైన్ మ్యాప్ చేయాలని కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. జడ్చర్ల–నాడెండ్ల, గద్వాల–మాచర్ల రైల్వేలైన్ల సర్వే పనులు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అయితే.. ఈ మార్గంలో ఆదాయం రాదని సర్వే చెబుతోందని, వెనుకబడిన జిల్లాల కింద వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రిక్వెస్ట్ చేశారు. బుధవారం రైల్వే సవరణ బిల్లు–2024 పై లోక్ సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ తరఫున మల్లు రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారదర్శకత లేకుండా, విజన్–2024 లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ బిల్లు కాగితాలకే పరిమితవుతుందన్నారు. ఇందులో రైల్వేలో పారదర్శకత కోసం స్వతంత్ర రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. ఈ బిల్లు రైల్వే బోర్డు అధికారాలపై, దాని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం చెబుతోన్న ఉద్దేశాలు ఒకటైతే... క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. బిల్లులో పారదర్శకత ఉండేల చూడాలని కేంద్రానికి సూచించారు.