నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాకే మూసీ సుందరీకరణ: ఎంపీ మల్లు రవి

నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాకే మూసీ సుందరీకరణ: ఎంపీ మల్లు రవి
  • ఈ విషయంలో ప్రతిపక్షాల పాఠాలు మాకు అవసరం లేదు
  • సీఎం రేవంత్  నిశబ్ద విప్లవ నాయకుడు
  • రాష్ట్రాన్ని బాగుచేయడానికి నిరంతరం కష్టపడుతున్నారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే సుందరీకరణ పనులు చేపడతామని, ఈ విషయంలో ప్రతిపక్షాలు తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ మల్లు రవి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో విధ్వంసం అయిన రాష్ర్టాన్ని బాగుచేయడానికి సీఎం రేవంత్  రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం నిశబ్ద విప్లవ నాయకుడన్నారు. కార్పొరేషన్  చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ప్రీతంతో కలిసి ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో రవి మాట్లాడారు. మూసీ సుందరీకరణ విషయంలో నిర్వాసితులకు డబుల్  బెడ్రూం ఇండ్లు అందిస్తున్నామని చెప్పారు.

ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఆర్థిక ప్యాకేజీ కూడా ఇస్తామని ఇదివరకే సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగినా, శాశ్వత పరిష్కారం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మూసీతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు.

యువకుల్లో స్కిల్స్  పెంచి, త్వరగా ఉద్యోగాలు పొందేందుకు తమ ప్రభుత్వం స్కిల్  యూనివర్సిటీ నిర్మిస్తున్నదని, అలాగే  క్రీడల్లో మన యువకులు మెడల్స్  గెలిచేందుకు స్పోర్ట్స్  యూనివర్సిటీని కూడా ప్రకటించామని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని, 5 వేల బడులు మూతపడ్డాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 28  అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకే క్యాంపస్ లో అన్ని గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందిస్తామన్నారు. 

ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ చరిత్రాత్మక నిర్ణయం

ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్స్  నిర్మించాలని కాంగ్రెస్  ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎస్సీ కార్పొరేషన్  చైర్మన్  ప్రీతం అన్నారు. అన్ని గురుకులాలు ఒకేచోట ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు   యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ స్టూడెంట్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రీతం తెలిపారు.

రాష్ట్రంలో నిర్లక్ష్య ధోరణికి సీఎం చరమగీతం పాడుతున్నారని బీసీ కార్పొరేషన్  చైర్మన్  నూతి శ్రీకాంత్  గౌడ్  అన్నారు. ఉన్నత కుటుంబాలతో సమానంగా పేద  విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్  ఇండియా గురుకులాలను కాంగ్రెస్  ఏర్పాటు చేస్తున్నదన్నారు.