ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్‌‌ : మల్లు రవి

ఎల్కతుర్తిలో  బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్‌‌ : మల్లు రవి
  • పాలమూరు 80% పూర్తి చేసినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా

న్యూఢిల్లీ, వెలుగు: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిలైందని ఎంపీ మల్లు రవి అన్నారు. వాహనాలు పెట్టి, డబ్బులు పంచి ఈ సభకు జనాలను పోగేశారని ఆరోపించారు. సభలో కేసీఆర్ మాటలకు ప్రజల నుంచి రెస్పాన్స్ రాలేదన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభలో కాంగ్రెస్‌‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు కంచె తీసేసి ప్రజాపాలన మొదలు పెట్టారన్నారు. కానీ, పదేండ్ల పాలనలో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో ప్రవర్తించారని, సెక్రటేరియట్‌‌కు రాకుండా ఫామ్ హౌస్ పరిపాలన చేశారని మండిపడ్డారు.

 రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి చేశామని నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్‌‌ది కాదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ కుటుంబం నేడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నదని చెప్పారు. కేసీఆర్ దరిద్రపు, దుష్టపాలన గురించి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. 

కేసీఆర్‌‌‌‌లో అహంకారం ఏ మాత్రం తగ్గలేదని, అసెంబ్లీ సమావేశాల పట్ల కూడా లెక్కలేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రజతోత్సవాల్లో కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు వేదిక‌‌ మీద మాట్లాడలేదని, వారంతా అసమర్థులా.. లేక వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినలేదని.. ఇప్పుడు కూడా వినే స్థితిలో కేసీఆర్ లేరని విమర్శించారు.