- కేంద్రమంత్రి రాజ్ నాథ్‌కు ఎంపీ మల్లు రవి వినతి
న్యూఢిల్లీ, వెలుగు : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఆర్మీ సెలెక్షన్ సెంటర్, ఎన్‌సీసీ ట్రైనింగ్ సెంటర్, ఆక్సిలరీ డిఫెన్స్ ప్రొడక్షన్ సెంటర్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఆ నియోజక వర్గ ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
నాగర్ కర్నూల్ లో ఆర్థిక, సామాజిక సమస్యలకు, ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లోటు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేంద్రాల స్థాపన వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, యువతలో నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు దోహదం పడుతుందని వివరించారు. తమ ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారని మల్లు రవి పేర్కొన్నారు.