లగచర్లలో ప్లాన్‌‌ ప్రకారమే కలెక్టర్‌‌‌‌పై దాడి : ఎంపీ మల్లు రవి

  • లగచర్లకు అధికారులను కావాలనే తీసుకెళ్లారు

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌‌పై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సురేశ్‌‌ కావాలనే అధికారులను అక్కడకు తీసుకెళ్లి, దాడి చేయించారని ఆరోపించారు. బుధవారం ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లగచర్లలో పర్యటించారు. గురువారం గాంధీ భవన్‌‌లో పర్యటన గురించి మీడియాతో మాట్లాడారు. కలెక్టర్‌‌‌‌, అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లగచర్లలో 4 నెలల నుంచే దాడికి ప్లాన్ చేశారని, కలెక్టర్‌‌‌‌ని ఒప్పించి తండాకు తీసుకురావాలని సురేశ్‌‌కి కేటీఆర్ చెప్పాడని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రెండో టీమ్ కలెక్టర్‌‌‌‌ని చంపాలని ప్లాన్ చేశారన్నారు. కాంగ్రెస్‌‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని కూడా చంపాలన్న ఉద్దేశంతో ఆయనను నిర్భందించారని చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఈ దాడి చేశానని రిమాండ్ రిపోర్ట్‌‌లో నరేందర్ రెడ్డి స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. 

సీఎం రేవంత్‌‌పై కుట్ర: కోదండరెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తేవలన్న ఉద్దేశంతోనే లగచర్లలో కుట్ర పన్ని దాడి చేశారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌‌‌‌ను మభ్యపెట్టి దాడి చేశారని, తాము లగచర్లలో పర్యటించామని, భూసేకరణ ఇంకా పూర్తి కాలేదన్నారు. పార్టీ తరఫున రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఈ ఘటనలో కేటీఆర్, నరేందర్ రెడ్డి కుట్రదారులని ఆయన ఆరోపించారు. వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికలు ప్రభావితం అయ్యేలా కేటీఆర్ కుట్రలు చేశారని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు.