ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్​దే : నీలం మధు

ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్​దే : నీలం మధు

రామచంద్రాపురం, వెలుగు: మెదక్​ జిల్లాకు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మెదక్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం ఉదయం రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్​ గ్రౌండ్ వద్ద మార్నింగ్ వాకర్స్​ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. సీనియర్​ సిటిజన్లు, రిటైర్డ్​ ఎంప్లాయీస్​, స్థానిక యువకులతో కలిసి వాకింగ్ చేస్తూ మాట్లాడారు. బీహెచ్​ఈఎల్, బీడీఎల్​, ఓడీఎఫ్, ఇక్రిశాట్​లాంటి సంస్థలను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొచ్చినవే అన్నారు. 

నేడు కొన్ని లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు, అన్ని వర్గాలకు సముచిత స్థానాలు దక్కాలంటే కేంద్రంలో కాంగ్రెస్​కు అధికారం ఇవ్వాలని అందుకే యువత ఆలోచించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. తాను ఎంపీగా గెలిస్తే ఇండోర్​ ప్లే గ్రౌండ్స్, వాకింగ్ ట్రాక్స్ , ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. 

అనంతరం బీహెచ్​ఈఎల్​లోని ఐఎన్​టీయూసీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్మికుల పక్షాన నిలబడే కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా యూనియన్​ నాయకులు ప్రమాణం చేశారు. ఐన్​టీయూసీ అధ్యక్షుడు రెహ్మాన్​, దామోదర్ రెడ్డి, కొండారెడ్డి, స్వామి, వలియుద్దీన్​, కొల్లాపూర్​ మున్సిపల్​ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

కార్మిక లోకానికి అండగా కాంగ్రెస్​  

కార్మిక లోకానికి కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా నిలస్తుందని నీలం మధు పేర్కొన్నారు. ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పటాన్​చెరు నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో ఆర్సీపురంలో మే డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల, నీలం మధు ముఖ్య అతిథులుగా హాజరై ఉమ్మడి మెదక్ ఐఎన్​టీయూసీ కార్మిక సంఘాలు, వివిధ పరిశ్రమల కార్మికులతో మాట్లాడారు.

 ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ గత పదేళ్లలో ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసిందన్నారు. కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లతో బుద్ధి చెప్పాలని, కార్మికుల భవిష్యత్​ బాగుండాలంటే కాంగ్రెస్​ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆనాడు మెదక్​కు ప్రాతినిథ్యం వహించిన ఇందిరా గాంధీ జిల్లా రూపు రేఖలు మార్చారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్​ను గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపుతామని డీసీసీ నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. 

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ ఉమ్మడి మెదక్​ జిల్లా కార్మికులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నల్తూర్​ మాజీ సర్పంచ్ పెంటయ్య ఈ సందర్భంగా కాంగ్రెస్ లో జాయిన్​ అయ్యారు. కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ స్టేట్​జనరల్ సెక్రటరీ అహ్మదుల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదర్​ రెడ్డి, ఓడీఎఫ్ ప్రెసిడెంట్ రవీందర్​ గౌడ్​, గణేశ్, వరుణ్​ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, సుందర్, చంద్రమౌళి పాల్గొన్నారు.