అమరావతి: ప్రతిపక్ష వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో నేతలు ఒక్కరొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు గురువారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవికి సైతం రిజైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి దారిలోనే మరొకొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు పయనిస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్యతో పాటు మరికొందరు వైసీపీని వీడుతారని ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వైసీపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక ప్రకటన చేశారు.
Also Read:-గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాల ఘటన షర్మిల సంచలన ట్వీట్
శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారడం లేదని.. పార్టీ మారుతునున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు నేను పార్టీ మారుతున్నట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను వైసీపీలోనే ఉంటానని ఈ సందర్భంగా పిల్లి తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన పార్టీని విడిచిపెట్టమని.. జగన్‌తోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. వైఎస్సార్ నన్ను రాజీయాల్లో ప్రోత్సహించారని.. వైసీపీ ఆవిర్భావం నుండి నేను జగన్‌తోనే ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు పిల్లి. నాకు ఏ వ్యాపారాలు లేవు.. ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.