అంజూ ప్రేమ వెనుక అంతర్జాతీయ కుట్ర : నరోత్తమ్‌ మిశ్రా

అంజూ ప్రేమ వెనుక అంతర్జాతీయ కుట్ర : నరోత్తమ్‌ మిశ్రా

ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ కు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్న ఫాతిమా అలియాస్ అంజూ ప్రేమ వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని ప్రభుత్వం అనుమానిస్తోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి  నరోత్తమ్‌ మిశ్రా అన్నారు.  ఈ కేసును మధ్యప్రదేశ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ విచారించనుందని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు.  

అంజూ ఇండియా నుంచి  పాకిస్థాన్‌కు చేరే వరకు లోతైన విచారణ జరుగుతుందని తెలిపారు.  అంజూకు పాకిస్థాన్ లో లభించిన స్వాగతం,  విలువైన బహుమతులు చూస్తుంటే దీని వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. దీనిపై నిశితంగా దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

పాకిస్థాన్ వెళ్లి ఫేస్ బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకున్న అంజూ గ్వాలియర్ జిల్లా వాసి. ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ . అంజూ తన మొదటి వివాహం తర్వాత తన భర్త అరవింద్‌తో కలిసి రాజస్థాన్‌లోని భివాడిలో నివసించింది . ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు.  అంజూ తల్లిదండ్రులు  హిందువుల నుంచి క్రిస్టియన్‌లోకి మారారు.  

నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.  దీని తర్వాత పాకిస్థాన్‌లో అంజుకి ఖరీదైన బహుమతులు లభించాయి.