వయనాడ్ ప్రజలకు సాకులు కాదు.. సాయం కావాలి: ప్రియాంక

వయనాడ్ ప్రజలకు సాకులు కాదు.. సాయం కావాలి:  ప్రియాంక

న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలతో ప్రభావితమైన వయనాడ్ ప్రజలు సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం సాయం చేయటానికి ముందుకు రాకపోగా సాకులు చెబుతున్నాయని విమర్శించారు. విపత్తులను రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరారు. ఈమేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు. " విపత్తులను రాజకీయాలతో ముడిపెట్టొద్దు. విపత్తులు సంభవించినప్పుడు బాధితుల పట్ల మానవత్వం, జాలి, కరుణ చూపేందుకు కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నాలు చేయాలి. వయనాడ్ ప్రజలు ఇప్పుడు సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తున్నారు. వారికి సాకులు అవసరం లేదు. తమ జీవితాలను మళ్లీ గౌరవంగా పునర్నిర్మించుకోవడానికి తక్షణ సాయం మాత్రమే వారికి కావాలి. గాయాలను మాన్పడానికి, ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే దేశం బలంగా నిలుస్తుంది. వయనాడ్ ప్రజల పట్ల కేంద్రంతోపాటు రాష్ట్రం తమ బాధ్యతను నెరవేర్చాలి" అని ప్రియాంక పేర్కొన్నారు.