న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రమేష్ బిధూరి కామెంట్స్‌పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రమేష్ బిధూరి కామెంట్స్ పై ఎంపీ ప్రియాంక గాంధీ తొలిసారి స్పందించారు. బుధవారం (జనవరి 8) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రమేష్ బిధూరి తన బుగ్గల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఇవన్నీ అనవసరం. ఢిల్లీ ప్రజల ముఖ్యమైన సమస్యల పక్కదారి పట్టకుండా మేం వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాం’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
జమిలీ ఎన్నికల బిల్లులపై చర్చించేందుకు జేపీసీ బుధవారం (జనవరి 8) తొలిసారిగా సమావేశం అయ్యింది. ఈ కమిటీలో సభ్యురాలిగా ఉన్న ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రమేష్ బిధూరి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఇక, జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రియాంక గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఒకేసారి అన్ని ఈవీఎంలు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీని రమేష్ బిధూరి ఏమన్నారంటే..?
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూరి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా చేయిస్తానని అనుచిత వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ హై కమాండ్ కూడా అతడి వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన రమేష్ బిధూరి ప్రియాంగా గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. ఆమెకు క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ రమేష్ బిధూరి కామెంట్స్‌పై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.