ఉద్యోగులకు సగం జీతంతో ఐదేళ్లు సెలవులు

ఉద్యోగులకు సగం జీతంతో ఐదేళ్లు సెలవులు

మధ్యప్రదేశ్ గవర్నమెంట్  ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు, జీతం విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీతం మాత్రం సగమే ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా తెచ్చిన ఆర్థిక పరిస్థితుల రీత్యా..ఖర్చులు తగ్గించుకోవటానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకతప్పలేదు. దుబారా ఎక్కడవుతుందో గమనించి దాన్ని కట్టడి చేసే యత్నంలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అత్యవసర విభాగాలైన విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఈ ఐదేళ్లపాటు సెలవులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైంది. సెకండే వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. థర్డ్ వేవ్ వస్తోందంటున్నారు. ఇలా వేవ్‌ మీద వేవ్‌ ముంచుకొస్తూ.. జనాలను హడలెత్తించటమేకాకుండా..ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దీంట్లో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతంతో పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు.మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేయకపోయినా..సగం జీతం తీసుకోవచ్చు. మిగతా సగం జీతం ప్రభుత్వానికి మిగులుతుందన్నమాట. దీంతో  ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు.

దీన్ని అమలు చేయటానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. దీనికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్ గా అమలులోకి తేవటానికి అధికారులు రెడీగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ వినూత్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇటువంటి వెసులుబాటు ఉంది. కానీ భారత్ లో మాత్రం సెలవులు ఇచ్చి సగం జీతం ఇవ్వడం ఇదే మొదటి సారి.