హన్మకొండ: బీసీలు ఉద్యమ పంథా మార్చాలని హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం తరహాలో, ఏపీలో కాపు ఉద్యమంలా పంథా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసినట్టే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని, అప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయని.. ప్రతీ ఒక్కరూ తెగించి పోరాడాలని బీసీలకు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.
ALSO READ | కిషన్ రెడ్డి.. బండి సంజయ్ మంత్రి పదవులకు రాజీనామా చేయండి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీసీ కులాలన్నీ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని, ఇప్పటి వరకూ బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీసీ నాయకులకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా... రానివ్వకుండా అణగతొక్కారని ఆయన చెప్పుకొచ్చారు. బీసీలు ఆర్థిక ప్రగతి సాధించాలంటే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ బంధు పథకం పెట్టి, ప్రతీ బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.