ఓయూ, వెలుగు : యూనివర్సిటీలో విద్యార్థులకు పూర్తి మెస్ చార్జీల స్కీమ్‌ను ప్రభుత్వం పునరుద్ధరించాలని రాజ్య సభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన బీసీ మహాసభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థులకు 1994 నుంచి ఫుల్ మెస్ చార్జీల స్కీమ్ రద్దు చేశారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
ప్రస్తుతం మెస్ బిల్లులు రూ.30వేల వరకు వస్తున్నాయని కానీ స్కాలర్షిప్లు రూ.15వేలు మాత్రమే మంజూరు కావడంతో మిగతా డబ్బులు విద్యార్థులు కట్టాల్సి వస్తుందన్నారు. కోర్సు తరువాత సర్టిఫికెట్లు తీసుకునే సమయలో బకాయిలు కడితే తప్ప సర్టిపికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు స్వామి గౌడ, రాజునేత, గుజ్జ కృష్ణ, వెంకటేశ్, అంజి పాల్గొన్నారు.