ముషీరాబాద్, వెలుగు: 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిటీ రిపోర్ట్ లో పేర్కొందని గుర్తుచేశారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టుల భర్తీకే డీఎస్సీ ప్రకటించారని, దీనిపై అధికారులు నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు.
రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, అనంతయ్య ధర్మారపు పవన్ కుమార్ అధ్యక్షతన ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నా జరిగింది. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గత పదేండ్లలో దాదాపు 6వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారని,దీంతో పేద విద్యార్థులకు విద్య అందకుండా చేశారని మండిపడ్డారు. అభ్యర్థులు పవన్ సందేశ్, మోడీ రాందేవ్, హరిత, స్వరూప పాల్గొన్నారు.