- రాష్ట్రస్థాయి బీసీల సదస్సులో ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. బీసీలపై బీజేపీ విధానాన్ని తక్షణమే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీసీల సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించి జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లను నెరవేర్చే పార్టీలకే బీసీల మద్దతు ఉంటుందని జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ నేత కొల్లా జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సదస్సులో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, నీల వెంకటేష్, గొరిగే మల్లేష్ యాదవ్, వేముల రామకృష్ణ, బైరి రామచందర్ యాదవ్, శ్రీనివాస్, శారదా దేవి, రమాదేవి, నందగోపాల్, రాజేందర్, అనంతయ్య పాల్గొన్నారు.