
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకులలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత మూడేండ్లుగా భవనాలకు అద్దె చెల్లించడం లేదని, ఖాళీ చేయాలని భవన యజమానులు గొడవ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములు అమ్మవద్దు. హాస్టల్స్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి’ అని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.
ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయా స్థలాలను బీసీ గురుకుల స్కూళ్లు, హాస్టళ్లకు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై సర్కారు తన వైఖరి మార్చుకోకపోతే విద్యార్థులను ప్రజా భవన్ మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కు తరలిస్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలకు భూములు ఉన్నప్పుడు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉండడానికి హాస్టల్స్ ఎందుకు నిర్మించరని నిలదీశారు.
యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి మాట్లాడుతూ నిశ్శబ్దంగా ఉంటే ప్రభుత్వ భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, విద్యార్థి లోకం మేలుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో హాస్టల్స్ ప్రారంభించి 27 సంవత్సరాలు అవుతున్నా ఒక్క హాస్టల్కూ సొంత భవనాలు లేకపోవడం దుర్మార్గమన్నారు.