
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు పెట్టి ఆమోదించడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అయితే రిజర్వేషన్ల అమలు ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
లక్డీకాపూల్‌లోని ఓ హోటల్ లో శనివారం ‘బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు కోసం ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై బీసీ జనసభ, బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంఘం అధ్యక్షుడు రాజారామ్ అధ్యక్షత వహించగా, కృష్ణయ్య, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సామాజిక ఉద్యమకారులు వి.జి.ఆర్ నారగోని, వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, బీసీ మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పెట్టించి అమలు చేయాలని యోచిస్తోందని.. అయితే అందులో జరిగే జాప్యం, అడ్డంకుల పై బీసీ మేధావులతో చర్చించాలని కోరారు. బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు తీసుకున్న విధానాలను పరిగణించాలన్నారు. ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం తరఫున న్యాయవాదిని నియమించి కొట్లాడాలని కోరారు. రిజర్వేషన్ల అమలుపై తాత్సారం చేస్తే, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.`