హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ రాఘవ్ చడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం (అక్టోబర్ 9) ఆయన ఓ నేషనల్ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వరుసగా హర్యానాలో మూడోసారి విజయం సాధించి దేశంలో బీజేపీ ఆధిపత్య రాజకీయ శక్తిగా ఎదిగిందన్న వ్యాఖ్యలను ఖండించారు. హర్యానాలో బీజేపీకి కేవలం 39 శాతం ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందని నొక్కిచెప్పిన చడ్డా.. 61 శాతం మంది ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్ షేరింగ్ బీజేపీకి వస్తే బీజేపీ ఆధిపత్య రాజకీయ శక్తిగా ఎదిగిందనే దానికి నేను అంగీకరించేవాడినని పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీ గెలిచిందనే దాని కంటే కాంగ్రెస్ ఓడిపోయిందని అనాలన్నారు. హర్యానాలో కాంగ్రెస్, ఆప్ కలిసి బరిలోకి దిగితే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ | ఈవీఎంలు హ్యాక్: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
జమ్మూ కాశ్మీర్‌లో ఇండియా కూటమి కలిసి పోరాడి బీజేపీని ఓడించింది. దురదృష్టవశాత్తూ హర్యానాలో అలా జరగకపోవడం వలన ఆ రాష్ట్రంలో ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్నారు. హర్యానాలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరకపోవడానికి రెండు పార్టీల వైఖరి కారణమన్నారు. ఈ ఫలితాల నుండి ఇండియా కూటమి గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందనుకున్న రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ చతికిలపడిందన్న చడ్డా.. ఇండియా కూటమిలోని పార్టీలను కలుపుకుపోతే ఫలితాలు అక్కడ వేరేగా ఉండేవని అన్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఉల్టాపల్టా చేస్తూ బీజేపీ హర్యానాలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.