తెల్లాపూర్, కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ను పూర్తి చేయండి : ఎంపీ రఘునందన్​ రావు

తెల్లాపూర్, కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ను పూర్తి చేయండి : ఎంపీ రఘునందన్​ రావు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని తెల్లాపూర్– కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మెదక్ ఎంపీ రఘునందన్​ రావు విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్‌‌‌‌సభలో జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. తాను ఎంపీగా ఉన్న మెదక్ నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. తెల్లాపూర్– పటాన్‌‌‌‌చెరు– సంగారెడ్డి– జోగిపేట్– మెదక్– రామాయణ్‌‌‌‌పేట్– సిద్దిపేట– కరీంనగర్ మీదుగా 225 కిలోమీటర్ల రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణానికి 1980లో ఇందిరా గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

కానీ, గత 44 ఏండ్లలో తెల్లాపూర్– పటాన్‌‌‌‌చెరుకు కేవలం 9 కిలోమీటర్ల రైల్వే లైన్ మాత్రమే పూర్తయిందన్నారు. అయితే, ఈ రూట్‌‌‌‌లో ఆదాయం లేదని మూడు నెలలకే రైల్‌‌‌‌ను బంద్ చేశారని పేర్కొన్నారు. సర్వే పూర్తి చేసుకున్న తెల్లాపూర్– కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌కు సంబంధించి 1980లోనే సర్వే పూర్తయిందని, వెంటనే ఈ రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలోకి సంగారెడ్డి జిల్లా హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో ఇప్పటి వరకు రైల్వే స్టేషనే లేదన్నారు.