ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం : ఎంపీ రఘునందన్ రావు 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం : ఎంపీ రఘునందన్ రావు 

మెదక్, వెలుగు:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ఆదివారం మెదక్ లో బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్ లో పార్టీ జిల్లా, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​చార్జిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టభద్రుల ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో కనుక్కొని ప్రతి ఒక ఓటర్ ను వ్యక్తిగతంగా కలిసి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారితో ఫోన్ లో మాట్లాడి పోలింగ్ రోజు తప్పని సరిగా వచ్చి ఓటు హక్కు వినియోగించు కునేలా చూడాల్సిన బాధ్యత పార్టీ బూతు, గ్రామ కమిటీ అధ్యక్షులదే అని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ యువత, ఉద్యోగులు బీజేపీ వైపే ఉన్నారన్నారు.

ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలు బీజేపీకి చెందిన వారే ఉండడం అనుకూలాంశమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేశ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు ఎం ఎల్ ఎన్ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు విజయ్ కుమార్, రాములు, విజయ్, మధు, ప్రసాద్, సతీశ్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​చార్జి విష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు
పాల్గొన్నారు. 


బీఆర్ఎస్ పని అయిపోయింది..

సిద్దిపేట రూరల్: తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలోని జిల్లా పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని, బీఆర్ఎస్ పోటీలోనే లేదని, కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

బీఆర్ఎస్ నాయకులవి అన్ని ఉత్తర ప్రగల్భాలేనని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. అనంతరం అంజి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, దూది శ్రీకాంత్ రెడ్డి, బాలేశ్ గౌడ్, విభీషణ్ రెడ్డి, శంకర్, నరేశ్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.