
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో శివాలయం కూల్చివేత ఘటనపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. " హిందువులపైనే ఎందుకు కేసులు? శివాలయంపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులైన హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. శనివారం ఆయన డీజీపీ జితేందర్‌ను కలిసి జిన్నారం శివాలయం ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఈ కేసులో ఇప్పటికే19 మందిని జైలుకు పంపారని చెప్పారు.
అయితే, ఘటనతో సంబంధమున్న మదర్సా పిల్లలను వదిలేసి..బీజేపీ, హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం హిందువుల మీదే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని చెప్పారు. మదార్సాలో ఉంటున్న వారు ఎవరన్నదానిపై విచారణ జరపాలని జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. శివాలయంలోకి మదర్సా పిల్లలు వెళ్లి వచ్చిన వీడియోలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 70 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. పాకిస్తానీలు, రోహింగ్యాలను వెళ్లగొట్టకపోతే భాగ్యనగరం మండుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల రక్షణలో విఫలమయ్యారని విమర్శించారు.