- ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే అధికారం, డబ్బు కోసం: ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి టౌన్, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోకాళ్లపై యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కేటీఆర్‌కు తండ్రి కేసీఆర్, చెల్లెలు కవిత, బావ హరీశ్‌రావుపై నమ్మకం లేదని, ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే రాజకీయాలకు స్వస్తి అని, పాదయాత్ర చేస్తానని కొత్త నాటకానికి తెర తీశారన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరై మాట్లాడారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాద ఘటనల బాధితులను పరామర్శించకపోవడం, భద్రాద్రి రాముడికి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ఇస్తానన్న 100 కోట్లు ఇవ్వకపోవడం పట్ల క్షమించాలని కేటీఆర్ పాదయాత్ర చేపట్టాలని ఆయన సూచించారు. లేదా భాగ్యనగర్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికైనా వెళ్లి క్షమించాలని ప్రార్థించాలన్నారు. పది నెలలుగా కేసీఆర్ ఫామ్ లో ఉండి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
కేటీఆర్కేవలం పదవి, అధికారం, డబ్బులు, ఫామ్ హౌస్ ల కోసమే రాజకీయాలలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు ఫామ్ హౌస్ లోని సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టి.. ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి బీజేపీ కార్యకర్త 100 సభ్యత్వాలను పూర్తిచేసుకుని క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలని, వారం రోజులపాటు కార్యకర్తలు అందరూ క్రియాశీల సభ్యత్వానికి అర్హులు కావాలని సూచించారు.