కమీషన్ పెంపు కోసమే రైస్ మిల్లర్ల ఆరాటం : ఎంపీ రఘునందన్​రావు

కమీషన్ పెంపు కోసమే రైస్ మిల్లర్ల ఆరాటం : ఎంపీ రఘునందన్​రావు
  • రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
  • తేమ ఉందని, రంగుమారాయని కొర్రీలు పెడుతున్న మిల్లర్లు 
  • సివిల్ సప్లై శాఖలో ఏం జరుగుతుందో సీఎంకు, మంత్రికి తెలియదు 

మెదక్, వెలుగు: రైస్​మిల్లర్ల తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మెదక్​ఎంపీ రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్​జిల్లా హవేలి ఘనపూర్ మండలం తొగుటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. రైస్  మిల్లర్లు తమ కమీషన్  పెంపు కోసం ఆరాట పడుతున్నారనే తప్ప రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదన్నారు. 

ఎలాంటి కష్టం లేకుండా మిల్లుల్లో కూర్చునే మిల్లర్లు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు అమ్ముకుందామంటే తేమ ఎక్కువ ఉందని, రంగు మారాయని, నూకలు ఎక్కువ అవుతున్నాయని, తరుగు తీస్తామంటూ కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెట్టడడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా రైతన్నలను కష్టాలకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు తరలించేందుకు వంద లారీలు అవసరం ఉంటే, కొన్నే లారీలు పంపితే రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల వద్ద దళారులను ఎంకరేజ్​చేసే వ్యవస్థ నడుస్తుండటం బాధాకరమన్నారు. 

సన్నాలకు రూ.500 బోనస్  ఇస్తారనుకుంటే  రూ.2,300కు కూడా కొనడానికి ముందుకు రావడం లేదన్నారు. సివిల్ సప్లై కమిషనర్ ఏం మాట్లాడుతున్నాడో.. ఆ శాఖలో ఏం జరుగుతుందో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదని విమర్శించారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొత్తం త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్  చేశారు. 

ఇద్దరూ ఇద్దరే.. 

సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కు ఏం పనిలేదని, ఇద్దరు దొంగలేనని రఘునందన్ రావు ఆరోపిం చారు. ఒకాయన ఢిల్లీకి వెళ్లాడు.. మరొకాయన పోనికి రెడీగా ఉన్నాడన్నారు. కేటీఆర్ కార్లు అమ్మిండా, సీఎం ఓటుకు నోటు కేసులో దొరికా డా.. అనేది ఇపుడు విషయం కాదన్నారు. వాటికి కోర్టులు ఉన్నాయని.. ఇప్పు డు ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయం అవసరం లేదన్నారు. లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ ​ఫామ్ హౌస్ కు పోయాడని, లక్ష కోట్లు పెట్టి మూసీ శుద్ధి చేస్తా అంటున్న రేవంత్ ఎక్కడికి పోతాడో తెలియని పరిస్థితి ఉందన్నా రు. 

సీఎం సెగ్మెంట్ లో రైతులు తిరగబడితే, దాని వెనక రాజకీయం ఉంది, పార్టీలు ఉన్నాయని చెప్ప డం సరికాదన్నారు. లగచర్ల, మల్లన్న సాగర్ వివాదం రెండూ ఒక్కటేనన్నారు. మల్లన్న సాగర్  కట్టినప్పుడు మెదక్  జిల్లాలో కేసీఆర్, హరీశ్ రావు రైతులను ఎత్తుకెళ్లారని, ఇపుడు లగచర్ల తండాల్లో మనుషులు కనిపిస్తలేరని పేర్కొన్నారు. అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రెండు వేరు వేరుగా కనిపిస్త లేదని, అపుడు కేసీఆర్​చేసిన విధానమే ఇపుడు రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారన్నారు.