అప్పుడు రైతులపై దాడి చేయించి, ఇప్పుడు పోరాటాలా?..కేటీఆర్‌‌‌‌పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్‌‌‌‌

అప్పుడు రైతులపై దాడి చేయించి, ఇప్పుడు పోరాటాలా?..కేటీఆర్‌‌‌‌పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం పేరుతో ఆనాడు మల్లన్నసాగర్ రైతులపై దాడులు చేయించి, కేసులు పెట్టించిన బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ ‌‌కేటీఆర్.. ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందర్ రావు విమర్శించారు. వంద ఎలుకలను తిన్న పిల్లి.. పాప ప్రక్షాళన కోసం కాశీకి వెళ్లినట్టుగా కేటీఆర్, బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను వేధించడం సరికాదన్నారు. లగచర్లలో రైతులపై దాడి, భూసేకరణ చట్టం అమలుపై పార్లమెంట్‌‌లో ప్రస్తావించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు తొలిరోజు సభ వాయిదా పడిందన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని విమర్శించారు. ‘నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్..’అన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని  మండిపడ్డారు.