![చెల్లి ఢిల్లీలో కాలు పెట్టింది..కేజ్రీవాల్ కొంపముంచింది: ఎంపీ రఘునందన్ రావు](https://static.v6velugu.com/uploads/2025/02/mp-raghunandan-rao-said-mlc-kavithas-liquor-scam-was-the-reason-for-kejriwal-defeat-in-delhi_WOuvZIiPmK.jpg)
లిక్కర్ స్కామే కేజ్రీవాల్ కొంపముంచిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందే ఇవాళ్టి ఫలితాలు నిరూపించాయని సెటైర్ వేశారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే పోరాటం చేస్తే.. ఆయన శిబిరం నుంచి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ పెట్టాడని చెప్పారు. ఇప్పుడు అదే అవినీతి కేజ్రీవాల్ కొంప ముంచిందన్నారు. లిక్కర్ స్కాం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ పార్టీని ముంచిందన్నారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులంతా అవినీతిలో కూరుకుపోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని మండిపడ్డారు.
మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. మార్పు తేస్తామంటే కాంగ్రెస్ ను నమ్మి అధికారంలోకి తెచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఆలోచించాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా రేవంత్ రెడ్డి చెల్లించడం లేదు. తెలంగాణలో సీఎం కుర్చీని ఎవరు లాక్కుంటారో తెలియని పరిస్థితి ఉంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేసీఆర్ 58 నుంచి 61కు పెంచితే... రేవంత్ రెడ్డి 65కు పెంచారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఇలా చేశాడు. ఇలాంటి చిల్లర నిర్ణయాల వల్ల కొత్త ఉద్యోగ నియామకాల మీద ప్రభావం పడుతుంది.
30 మెడికల్ కాలేజీలు పెట్టడం కంటే మూడు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం మంచిదని చెప్పిన కేటీఆర్... ఇప్పుడు అదే పని చేస్తున్నడు. రాహుల్ గాంధీ సపోర్టుతోనే బీజేపీ గెలిచిందని కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నడు. మీ అయ్య కేసీఆర్ పదేళ్లు సీఎం, పదేళ్లు ఉద్యమం చేశాడు. నువ్వు, మీ బావ, మీ అయ్య... ఎమ్మెల్యేలుగా ఉన్నా... ఎందుకు మీకు ఎమ్మెల్సీ అభ్యర్థి దొరకడం లేదు కేటీఆర్. అభ్యర్థిని బరిలోకి దింపకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత తమ ఓట్లతోనే గెలిచారని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తుందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.