- ఎగ్జిట్ పోల్స్ కు అందని హర్యానా ఫలితాలు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటివి
- స్థానిక ఎన్నికల్లో పైరవి కారులకు టికెట్ల నిరాకరణ
- ఎంపీ రఘునందన్ రావు
జగదేవపూర్, వెలుగు: అగ్ర రాజ్యాలైన రష్యా, అమెరికా లాంటి దేశాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో మాజీ సర్పంచ్ బుద్ధ జ్యోతి మహేందర్, చాట్లపల్లి బీఆర్ఎస్ నాయకుడు దేశాయ్ రెడ్డి ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిందని, జమ్ముకశ్మీర్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారం అనుభవించి పతనమైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిన పది నెలల్లోనే పతనమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటివని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. ప్రతీ బూత్ అధ్యక్షుడు వంద సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో గుర్తింపు ఉంటుందని, పైరవీకారులకు టికెట్లు ఇవ్వమని చెప్పారు. బీజేపీ లో యువతకు ప్రాధాన్యం ఉంటుందని, దుబ్బాక నియోజకవర్గం కంటే గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఐలయ్య, ప్రసాద్, రాంరెడ్డి, రాములు, శ్రీధర్, కృష్ణమూర్తి, యశ్వంత్ రెడ్డి, వెంకట రమణ, గురువా రెడ్డి, శ్రీనివాస్, బాల్ రాజు, అజిత్ రెడ్డి, ఉమా, నర్సమ్మ ఉన్నారు.