హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి : ఎంపీ రఘునందన్​రావు

హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి : ఎంపీ రఘునందన్​రావు
  • ఎంపీ రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని ప్రతి పక్షాలు, ప్రజల నుంచి డిమాండ్​ వస్తోందని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఎంపీ రఘునందన్​రావు సూచించారు. సోమవారం దుబ్బాక పట్టణ పరిధిలోని చెల్లాపూర్​వేణుగోపాల స్వామి ఆలయంలో సీసీ బెడ్​ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం మాట మార్చకుండా, బ్యాంకు లోన్లు ఉన్నా, పదేండ్లుగా ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నా నూటికి నూరు శాతం కూలకొట్టాల్సిందే అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లను నిష్పక్షపాతంగా క్లియర్​ చేయాలన్నారు. పేదలు చెరువుల్లో నిర్మించుకున్న ఇళ్లకు బదులుగా కోకాపేట ప్రాంతాల్లో ప్లాట్లను కేటాయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. హైడ్రా పనితీరు నిష్పక్షపాతంగా సాగకపోతే కమిషనర్​ రంగనాథ్​ పదవి నుంచి దిగిపోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్​ మల్లారెడ్డి, బీజేపీ నాయకులు సుభాష్​ రెడ్డి, తిరుమల్​రెడ్డి, వెంకట్​గౌడ్, ప్రవీణ్, రమణారెడ్డి, నేహాల్​గౌడ్, నవీన్, కనకరాజు, సాయి గౌడ్​పాల్గొన్నారు.