సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ రఘునందన్​రావు

సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ రఘునందన్​రావు

 సంగారెడ్డి టౌన్, వెలుగు: సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎంపీ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్​రావు మాట్లాడుతూ.. గతేడాది వరంగల్​లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్​ ఉద్యోగులను పర్మనెంట్​చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.

సర్వ శిక్ష అభియాన్​లో పనిచేస్తున్నవారు 50 శాతం పైగా మహిళలు ఉన్నారని జిల్లా మంత్రిగా కొండా సురేఖ బాధ్యత వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధన మేరకు పే స్కేల్ ఫిక్స్ చేస్తే 50% కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. బాధ్యతగల ఎంపీగా సీఎం అపాయింట్ కోసం ప్రయత్నం చేసి ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశ్​పాండే, మాణిక్ రావు, పోచారం రాములు, జగన్, రాజశేఖర్ రెడ్డి, కసిని వాసు, ప్రవీణ్ పాల్గొన్నారు.