
- జీవో 111ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తురాలేదా?..
- ఓఆర్ఆర్ పక్కన హైరైజ్ బిల్డింగ్‌లకు పర్మిషన్ ఎలా ఇచ్చారు?
- అప్పుడు ఎక్కడ మొక్కలు నాటారు.. ఎన్ని చెట్లు పెంచారో చెప్పాలి
- హెచ్‌సీయూ భూములపై పోరాటం చేస్తున్నది బీజేపీయేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: 111 జీవోను ఎత్తేసినప్పుడు కేటీఆర్కు ప్రకృతి గుర్తుకురాలేదా అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఆ జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో ఎందుకు ప్రయత్నించిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరానికి ‘లంగ్స్ స్పేస్’గా ఉన్న ఆ జీవో పరిధిలోని చెట్లను నరికివేసి నిర్మాణాలు జరిపినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూములపై కేటీఆర్ మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నామని.. కానీ, లక్షలాది ఎకరాల భూములు ఉన్న 111 జీవో అంశంలో ఆయన కుటుంబం నిర్మించిన ఫాం హౌస్‌ల గురించి కూడా సమాధానం చెప్పాలన్నారు.
పర్యావరణం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని ఆయన అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదన్నారు. ఓఆర్ఆర్ పక్కన 50 అంతస్థుల భవనాలకు అనుమతించిన అప్పటి మంత్రి కేటీఆర్.. ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రఘునందన్ రావు అన్నారు. అప్పుడు ఎక్కడ మొక్కలు నాటారు? ఎన్ని చెట్లు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాటి బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ పర్యావరణాన్ని విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్ సీయూలో కాంగ్రెస్ విధ్వంసాన్ని మొదటి నుంచి అడ్డుకొని పోరాటం చేస్తున్నది బీజేపీయేనని చెప్పారు.
ప్రధానిగా మోదీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రఘునందన్ స్పందించారు. మోదీ విధేయతకు ప్రజలు గౌరవం ఇచ్చి.. రాష్ట్రంలో 8 సీట్లు ఇచ్చారని.. బీఆర్ఎస్ ను సున్నా సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కుకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. మోదీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాట్లాడుతున్న కేటీఆర్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తప్పుల గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత కేంద్రప్రభుత్వం నూరుశాతం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.