తెలంగాణ అభివృద్ధిని కేంద్రం విస్మరించింది : ఎంపీ రఘురాం రెడ్డి

తెలంగాణ అభివృద్ధిని కేంద్రం విస్మరించింది : ఎంపీ రఘురాం రెడ్డి
  • రాష్ట్రానికి నిధులు  కేటాయించని బడ్జెట్​ను వ్యతిరేకిస్తున్నం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అభివృద్ధికి నిధులు దక్కని కేంద్ర బడ్జెట్ 2025‌‌–26 ను వ్యతిరేకిస్తున్నట్టు ఖమ్మం ఎంపీ రఘురామి రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ అభివృద్ధి అవసరాలను కేంద్రం మరోసారి విస్మరించిందని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరూ గొంతు విప్పాలని కోరారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసి చాలా కాలమైందని.. ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి బీజేపీ ఎంపీలు రాష్ట్ర పురోగతికి కలిసి రావాలని కోరారు.

 సోమవారం లోక్ సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో తెలంగాణ నుంచి ఎంపీ రఘురామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాతో పోల్చితే తెలంగాణ జనాభా కేవలం 3 శాతమే అన్నారు. అయినప్పటికీ జీడీపీ రేటు మాత్రం 5 శాతంగా ఉందని చెప్పారు. ఫిబ్రవరి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.5,211 కోట్ల జీఎస్టీ వసూలు అయిందన్నారు. ఇలా దేశాభివృద్ధిలో రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం నిధులివ్వడంలో వివక్ష చూపుతోందన్నారు. 

ప్రధాన ప్రాజెక్టులకు వేటికి కేంద్రం ఒక్క రూపాయి కేటాయించలేదని ఫైర్ అయ్యారు. తక్కువ వయసు, చిన్న రాష్ట్రమైనప్పటికీ అనతికాలంలోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, అభివృద్ధి తిరోగమనంలో పోతోందన్నారు. ముఖ్యంగా దేశ సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం నీరుగార్చుతోందని విమర్శించారు.