నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సహకరించాలని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. పార్లమెంట్బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం జిల్లా అభివృద్ధిపై పలు డిమాండ్లను కేంద్రానికి విన్నవించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద నల్గొండలో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించాలని, దేవరకొండ, మిర్యాలగూడలో 100 పడకల ఆస్పత్రులు, లోక్ సభ నియోజకవర్గంలో పీహెచ్సీ భవనాలకు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలన్నారు. కృష్ణపట్నం, వైజాగ్, చెన్నై పోర్టుకి అనుసంధానమయ్యే నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో డ్రై పోర్ట్ నిర్మాణానికి పీఎం గతిశక్తి పథకం కింద నిధులివ్వాలని కోరారు.
పారిశ్రామిక వృద్ధి కలిగిన ఈ ప్రాంతంతో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తే స్థానిక పరిశ్రమలకు ఊతమిస్తుందని, నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. సూర్యాపేటలో కేంద్రీయ విద్యాలయం, హైదరాబాద్- –విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.