నాగార్జునసాగర్, బుద్ధవనం కోసం రూ. 100 కోట్లు ఇవ్వండి

న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జునసాగర్, బుద్ధవనం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. అలాగే, తెలంగాణ పర్యాటక రంగాభివృద్ధికి కేంద్రం ‘‘స్వదేశ దర్శన్ పథకం 2.0’’లో భాగంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌ను ఆయన నివాసంలో కలిసి, వినతిపత్రం అందజేశారు. చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలను గ్లోబల్ టూరిజం కేంద్రాలుగా డెవలప్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ఎత్తిపోతల జలపాతం, నాగార్జున కొండ, బుద్ధవనం వంటి ప్రధాన ఆకర్షణ ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ నివాసాల అభివృద్ధితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు. దీని వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడతాయని చెప్పారు.