న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్నూ వేడేక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలోని హౌజ్ ఖాసీ ఏరియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై విమర్శల వర్షం కురిపించారు.
అవినీతి రహిత పాలన అందిస్తామంటూ వాగ్నర్ కారులో వచ్చిన కేజ్రీవాల్.. షీష్ మహాల్ వంటి విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు. అలాగే.. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో పూర్తి విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు, యుమనా నదిని శుభ్రం చేస్తామని కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను ఆప్ సర్కార్ నిలబెట్టుకోలేదన్నారు. ఐదేళ్లలో యమునా నదిని శుభ్రం చేసి అందులో స్నానం చేస్తానని కేజ్రీవాల్ చెప్పగా.. ఇప్పటికీ యమునా నది మురికికూపంగా ఉందని విమర్శించారు.
యమునా నీటిని తాగాలని కేజ్రీవాల్‌కు సవాల్ చేస్తున్నానని.. ఆయన ఆ పని చేస్తే తర్వాత ఆసుపత్రిలో కలుసుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ఆప్ పేదల పార్టీ అని కేజ్రీవాల్ ఎప్పుడు చెబుతుంటారని.. కానీ ఆయన టీమ్‌లో వెనుకబడిన, దళిత, మైనారిటీలకు చెందిన ఒక్క వ్యక్తి కూడా లేడని ఫైర్ అయ్యారు. అలాగే.. ఢిల్లీలో అల్లర్లు జరిగితే కేజ్రీవాల్, ఆయన పార్టీ నేతలు ఎవరూ బయటకు రారని.. ప్రజల కోసం గొంతు విప్పి వారికి అండగా నిలిచేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.