ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. పదేళ్లలో వాళ్లకు చేసిందేమి లేదు: రాహుల్ గాంధీ

ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. పదేళ్లలో వాళ్లకు చేసిందేమి లేదు: రాహుల్ గాంధీ

రాంచీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ అసెంబ్లీ  ఎన్నికల రెండో విడత ప్రచారంలో భాగంగా శుక్రవారం (నవంబర్ 15) బహిరంగా సభలో పాల్గొన్న రాహుల్ కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో దళిత గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని విమర్శించారు. ఇండియాలో ఆదివాసీలు 15 శాతం ఉన్నారని.. అయినప్పటికీ గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోడీ దేశంలోని పేదల సంపదను తన మిత్రులైన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిత్యం నేను ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. ప్రధానిగా పదేళ్లలో వాళ్ల కోసం చేసిందేమి లేదన్నారు. ముంబైలోని ధారవిలో రూ.లక్ష కోట్ల విలువైన భూమి అదానీకి కట్టబెట్టారు.. పేదల భూములు అక్రమంగా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారని నిప్పులు చెరిగారు. 

ALSO READ | బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‎లో నోటోరియస్ క్రిమినల్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజం

కేంద్ర ప్రభుత్వం బిలియనీర్ అదానీకి చేసిన రుణమాఫీతో దేశంలోని రైతులకు రుణమాఫీ పూర్తయ్యేది అన్నారు. బీజేపీ పాలనలో దేశంలోని దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కాగా, జార్ఖండ్‎లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2024, నవంబర్ 13న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియగా.. 2024, నవంబర్ 20వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. 2024, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.