న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సోమవారం (జనవరి 13) నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీలంపూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అలాగే.. వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు తమ హక్కును పొందడం వాళ్లకు ఇష్టం లేదు.. అబద్ధపు, తప్పుడు హామీలు ఇవ్వడంలో ప్రధాని మోడీ, కేజ్రీవాల్‌ది ఒకటే విధానం.. వాళ్లిద్దరిలో ఎలాంటి తేడా లేదని విమర్శలు గుప్పించారు.
ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని బీజేపీ, ఆప్ చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఇరువురు విఫలమయ్యారని.. బీజేపీ, ఆప్ పాలనలో ధనవంతులు మరింత సంపన్నులు అవుతుంటే.. పేదలు మరింత పేదరికంలోకి వెళ్లారని విమర్శించారు. మోడీ, కేజ్రీవాల్ వెనుకబడిన, మైనారిటీ కమ్యూనిటీలు వాళ్లు హక్కును పొందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అవినీతిని ఎదుర్కోవడం, ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం వంటి వాగ్దానాలను నెరవేర్చడంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ విఫలమైందన్నారు.
ALSO READ | బంగ్లా డిప్యూటీ హైకమిషనర్ కు భారత్ నోటీసులు
కాంగ్రెస్‌కు ప్రజలందరూ సమానమేనని, అణగారిన వర్గాల అభ్యున్నతి, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. దేశ పురోగతిలో పేదలు, మైనారిటీల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలనేది కాంగ్రెస్ వైఖరి అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహిస్తుందని, చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తామని, రిజర్వేషన్ పరిమితిని పెంచుతుందని రాహుల్ గాంధీ వాగ్ధానం చేశారు.