న్యూఢిల్లీ: అడుగడుగునా మహిళలకు అడ్డంకులు సృష్టిస్తున్న సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా తమ హక్కులను పోరాడి సాధించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఔత్సాహిక మహిళా నేతలను రాజకీయంగా ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీకి విమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఒక మంచి అవకాశం అని అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్(ఏఐఎంసీ) 40వ వార్షికోత్సవం సందర్భంగా మహిళా కార్యకర్తలందరికీ ఆయన ట్విట్టర్(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్న ఎంతో మంది మహిళలను కలిసినట్టు చెప్పారు. మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎంతో మంది అతివలు గళమెత్తుతున్నారని, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నారని చెప్పారు.
మహిళల గొంతుగా ఏఐఎంసీ
1984 లో బెంగళూరు కన్వెన్షన్ నుంచి ఏర్పడిన ఏఐఎంసీ ఎంతో ముందడుగు వేసిందని రాహుల్‌గాంధీ అన్నారు. 4 దశాబ్దాలుగా మహిళలకు న్యాయం కోసం నిర్భయమైన గొంతుగా ఉన్నదని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో అత్యంత చురుకైన సంస్థల్లో ఒకటిగా స్థిరపడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మెంబర్షిప్ ప్రారంభించినందుకు ఏఐఎంసీని అభినందిస్తున్నట్టు చెప్పారు. కుల, మత, వర్గాలకతీతంగా రాజకీయాల్లో మహిళలను భాగస్వాములను చేసేందుకు ఏఐఎంసీ నిరంతరంగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
కాగా, సగం జనాభాకు పూర్తి హక్కులు అనేది రాజ్యాంగపరమైన బాధ్యత అని, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి అంతరిక్షయానం వరకు దేశ నిర్మాణంలో నారీశక్తి సమాన సహకారం అందించిందని తెలిపారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులు, కార్యకర్తలకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.