ముప్పు ముంచుకొస్తోంది.. వాయు కాలుష్యం నేషనల్ ఎమర్జెన్సీయే: రాహుల్‌ గాంధీ

ముప్పు ముంచుకొస్తోంది.. వాయు కాలుష్యం నేషనల్ ఎమర్జెన్సీయే: రాహుల్‌ గాంధీ

ఉత్తర భారతంలో వాయుకాలుష్యం ముప్పు ముంచుకొస్తున్నదని కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం జాతీయ అత్యవసర పరిస్థితే అని ఆయన పేర్కొన్నారు.  రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ సమస్యపై సమగ్రం చర్చించి శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని తన సహచర ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని, విమర్శలకు ఇది సమయం కాదని సూచించారు. ఈ అంశంపై  పర్యావరణవేత్త విమలేందు ఝాతో కలిసి ఇండియా గేట్‌ వద్ద తాను మాట్లాడిన వీడియోను రాహుల్‌  ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘‘వాయు కాలుష్యానికి పేదలు, సామాన్యులే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. వృద్ధులు ఊపిరి పీల్చుకోలేక సతమతం అవుతున్నారు. స్వచ్ఛమైన గాలి కోసం కొన్ని వేల కుటుంబాలు తహతహలాడుతున్నాయి. ఉత్తర భారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. కాలుష్య మేఘాలు వందల కిలోమీటర్లు వ్యాపిస్తున్నాయి. అలాంటి జటిల సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలతో పాటు కంపెనీలు, పౌరులు, నిపుణులు ఇలా ప్రతిఒక్కరూ చేతులు కలపాలి. 

అప్పుడే విషపూరిత వాతావరణాన్ని శుభ్రం చేయగలం. ఈ సమస్యపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు మోపకుండా పరిష్కారం వైపు అడుగులు వేయాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు. దీని కోసం పార్లమెంటు సమావేశాలను వేదికగా మలచుకోవాలని, కాలుష్య భూతాన్ని శాశ్వతంగా అంతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కాగా.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభమై డిసెంబరు 20 వరకు జరగనున్నాయి.