మేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ

 మేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ

ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక్షణ్ అభియాన్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కులగణన చేపట్టామని, దీనిని జనగణనలా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని అన్నారు. కులగణనలో అడిగే ప్రశ్నలను ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదని, ప్రజలే వాటిని డిజైన్ చేశారని చెప్పారు. ఇది ప్రజాప్రక్రియలా సాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన చేసి తీరుతామని చెప్పారు.

 ప్రతి సామాజిక వర్గం యొక్క ఆర్థిక, సామాజిక స్థితిని తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో రిజల్ట్ వస్తుందని, ఇది దేశవ్యాప్త సర్వేకు దోహదపడుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని తాము కోరామని, పార్లమెంటులో ఇందుకోసం తాను పట్టుపట్టానని అన్నారు. ఈ దేశంలో 15% దళితులు, 8% ఆదివాసీలు, 15% మైనార్టీలు ఉన్నారన్నారు. కానీ వెనుకబడిన వర్గాల వారు ఎంత మంది ఉన్నారంటే ఆ లెక్కలే లేవన్నారు. కొందరు 50% ఉన్నారని చెబుతున్నారని, మరికొందరు 55% ఉన్నారంటున్నారని అన్నారు.

 తక్కువల తక్కువ యాభై శాతం అనుకున్నా.. ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారంతా కలిసి 90% మంది ఉంటారని అన్నారు. వారికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ, కర్ణాటకలో కులగణన చేపట్టామని చెప్పారు. తాము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన చేసితీరుతామన్నారు. ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు అధికారం అప్పగిస్తే రిజర్వేషన్లు ప్రమాదంలో పడిపోతాయని చెప్పారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ వివరించాలని విజ్ఞప్తి చేశారు. 

మోదీ రాజ్యాంగం చదవలేదు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగం చదవలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన పాలన తీరును బట్టి అందరికీ అర్థమవుతుందని అన్నారు. రాజ్యాంగంలో  సామాజిక న్యాయం, సమానత్వం ప్రస్ఫుటిస్తుందని, మోదీ పాలనలో అది కొరవడిందని అన్నారు. ‘మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్లండి.. కేరళలో నారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, మహారాష్ట్రలో ఫూలే, శివాజీ మహారాజ్ ఇలా ప్రతి స్టేట్ లో సామాజిక న్యాయం కోసం పోరాడిన ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు. సావర్కర్ నినాదం అదికాదు.. దానికి విరుద్ధం. రాజ్యాంగంలో ఎక్కడైనా హింసను ప్రయోగించాలని ఉందా..? ఎవరినైనా కొట్టాలని, చంపాలని ఉందా..? అబద్ధాలతో పాలించాలని ఉందా..?’ అని రాహుల్ ప్రశ్నించారు. రాజ్యాంగం సత్యం, అహింసకు సంబంధించిన పుస్తకమని అన్నారు. అహింసా మార్గాన్నే చూపుతుందని రాహుల్ గాంధీ అన్నారు.