సత్తుపల్లి, వెలుగు : హరీశ్‌రావు, కేటీఆర్ కు మతిభ్రమించిందని, మహిళల్ని అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారు సీతారామ ప్రాజెక్టు పనులు కేవలం 39 శాతం మాత్రమే చేసి వదిలేసిందని, హరీశ్‌రావు మాత్రం 90శాతం పనులు చేశామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను మరిచిన కేసీఆర్ కంప్లీట్ గా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కి తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ కేటీఆర్ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఎంపీ నిధుల్లో సత్తుపల్లి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీని కోరారు. తొలిసారి సత్తుపల్లికి వచ్చిన ఎంపీని ఎమ్మెల్యే దంపతులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు పాల్గొన్నారు.
జక్కంపూడి కుటుంబానికి పరామర్శ
తల్లాడ/కుసుమంచి : మండలంలోని బిల్లుపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం జక్కంపూడి కుటుంబాన్ని పరామర్శించారు. కొత్తగా మంజూరైన డోర్నకల్, మిర్యాలగూడ రైల్యేలైన్ అలైన్మెంట్ మార్చాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీకి శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు