ఎంపీ పోతుగంటి రాములు
గద్వాల, వెలుగు : నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని మూడు జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు అయినట్లు ఎంపీ రాములు తెలిపారు. ఆదివారం గద్వాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్వకుర్తి, సోమశిల నేషనల్ హైవేకు రూ. 1200 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. ఎర్రవల్లి చౌరస్తా దగ్గర అండర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందని, ఆరు లేన్ల నేషనల్ హైవే కారణంగా పనులు లేట్ అవుతున్నాయన్నారు. రాయచూరు, గద్వాల హైవే కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రపోజల్ పెట్టామన్నారు. అనంతరం గట్టు మండల కేంద్రంలో కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ రాజారెడ్డి ఉన్నారు.
ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా
పలుచోట్ల రాకపోకలు బంద్
అమీన్‌పూర్‌లో మట్టి మిద్దె కూలి ఆరుగురికి గాయాలు
వనపర్తి, మక్తల్, మాగనూర్, ఊట్కూర్, ధన్వాడ, దేవరకద్ర, వెలుగు: కర్నాటకతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు గేట్లు ఓపెన్ చేశారు. మదనాపురం మండలంలోని రామన్ పాడ్ గేట్లు ఎత్తగా.. సరళా సాగర్ ఆటోమెటిక్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. ఆత్మకూరు-–కొత్తకోట మధ్య సరళా సాగర్ వాగుపై ఉన్న రోడ్డు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మక్తల్ మండలంలోని సంగంబండ ప్రాజెక్టుకు 7 గేట్లు ఎత్తి 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కింద ఉన్న మాగనూర్ పెద్దవాగు లోలెవెల్ బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండడంతో మండలంలోని నేరడగం, అడవిసత్యరం, ఉజ్జెల్లి, బైరంపల్లి, వర్కూర్‌తో మరో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. దేవరకద్ర మండంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో మూడు గేట్లు ఎత్తి 5100 క్యూసెక్కుల నీటిని ఊక చెట్టువాగులోకి వదలారు. సాయంత్రం ఒకగేట్ క్లోజ్ చేశారు. ధన్వాడ మండలంలోని గున్ముక్ల చెరువు కింద ఉన్న మన్నెవాగు ఉధృతంగా పారుతుండడంతో గున్ముక్ల, ధన్వాడ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఊట్కూర్ మండలం అమీన్ పూర్ గ్రామంలో మట్టిమిద్దె కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద బాలప్ప, లక్ష్మి దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు మహేశ్వరి, ఐశ్వర్య, నవీన్, వీరి బాబాయి చిన్న బాలప్పకు గాయాలు కాగా.. గ్రామస్తులు నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం వారిని
పరామర్శించారు.
కుల వృత్తులకు గౌరవం పెరిగింది
పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, వెలుగు : తెలంగాణ ఏర్పాటయ్యాక కుల వృత్తులకు గౌరవం పెరిగిందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జేజేర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ శాంతన్న యాదవ్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి గొల్లకురుమలకు జీవాలను పంపిణీ చేసిందన్నారు. త్వరలో జరిగే గొర్రెల పంపిణీలో వీలైతే జిల్లాకు మరిన్ని యూనిట్లు తీసుకొచ్చి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని న్యూ విజన్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పత్రీజీ ధ్యాన విజయం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా అద్భుత శక్తి లభిస్తుందని, జిల్లా కేంద్రంలో మహా పిరమిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పిరమిడ్ నిర్మాణానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో షాద్‌నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గొర్రె కాపరుల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షుడుబాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం జోలికొస్తే ఊరుకోం
టీఎంఎం ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ మంత్రి చెన్నకేశవులు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని టీఎంఎం ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ మంత్రి నర్సింహ్మయ్య హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం విగ్రహాన్ని తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. టౌన్ లో మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఒకే వరుసలో ఉన్నా కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఎంఎం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం రాఘవేందర్, జనరల్ సెక్రటరీ పత్తి వెంకటేశ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, సెక్రటరీ రాజు, నియోజకవర్గ ప్రెసిడెంట్ మాసయ్య, టౌన్ ప్రెసిడెంట్ శివకుమార్, నేతలు తిరుపతయ్య, మంత్రి నవీన్ కుమార్ పాల్గొన్నారు.
యన్మన్గండ్లలో చిన్నారికి డెంగీ
నవాబుపేట, వెలుగు: నవాబేపేట మండలం యన్మన్గండ్ల గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారికి డెంగీ సోకినట్లు మండల మెడికల్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా మలేరియా ఆఫీసర్ విజయకుమార్ తెలిపారు. ఆదివారం గ్రామానికి చేరుకున్న వైద్యబృందం బాధిత ఇంటి ఆవరణలో నిల్వవున్న నీటిని పారిబోయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం గ్రామస్తులకు దోమల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శకుంతల, అసిస్టెంట్ శరభలింగం, ఏఎన్ఎం బాలీశ్వరి, ఆశ వర్కర్లు నీలమ్మ, విజయలక్ష్మి పాల్డొన్నారు.
తెలుగుకు మరో భాష సాటిరాదు
అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తెలుగుకు మరో భాష సాటిరాదని అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి కొనియాడారు. ఆదివారం నాగర్ కర్నూల్ సింగిల్ విండో మీటింగ్ హాల్‌లో ‘కావ్యాలు తెలంగాణ జాతి సంపదలు’ అంశంపై నిర్వహించిన సదస్సును ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కవులు ఎన్నో ప్రసిద్ధ కావ్యాలు రచించారని, అవి తెలుగు భాష అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ దుందుబి నదిపై 60 ఏళ్ల కిందట అద్భుతమైన జీవ కావ్యాన్ని రచించారని గుర్తుచేశారు. ఈ కావ్వం మానవ సమాజం జీవితం లోని బాధలు, కన్నీళ్లు, దుఃఖాలను ప్రతిబింబిస్తుందన్నారు. అనంతరం నాటి సమాజ స్థితిగతుల్ని కళ్లకు గట్టేలా పూర్వకావ్యాల పరిచయానికి సంకల్పించిన కవులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రవి ప్రకాశ్ రావు, భాస్కరయోగి, సుబ్బయ్య, మదిలేటి, వహీద్ పాల్గొన్నారు.
సర్పంచ్ ఇంట్లో చోరీ
పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన దొంగ
అచ్చంపేట, వెలుగు: మహిళా సర్పంచ్ ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని పుస్తెల తాడును చోరీ చేశాడో దొంగ. బాధితుల వివరాల ప్రకారం.. పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సర్పంచ్శారద, భాస్కర్దంపతులు అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ సర్పంచ్శారద మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును కట్‌చేసుకుని తీసుకెళ్లాడు. కొద్ది సేపటికే గమనించిన ఆమె భర్తను నిద్ర లేపి విషయం చెప్పింది. ఆయన ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరో ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
సాగునీటి ప్రయత్నాలు సఫలమవుతున్నయ్
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వనపర్తి మండలంలోని ఖాన్ చెరువు కొత్త కాలువ నిర్మాణానికి రూ.18.66 కోట్ల మంజూరు కావటంతో రైతులు ఆదివారం మంత్రి నిరంజన్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మోరీలు, కమ్యానిటీ హాళ్లు కట్టి అదే అభివృద్ధి అని చూపించారని విమర్శించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సాగునీరు తెచ్చామని, దత్తాయపల్లి నుంచి ఖాన్ చెరువు వరకు కాల్వను కోసం సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నిధులు మంజూరు చేయించానన్నారు. వచ్చే యాసంగి నాటికి సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాల్లోని 5 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. వాగులపై ఆరు చెక్ డ్యామ్‌లను కేవలం 45 రోజులలో నిర్మించామని, మరో 10 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయని తెలిపారు. జడ్పీ చైర్మన్ లోక్ నాథ్,పార్టీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్ పాల్గొన్నారు.
పింఛన్ కార్డుల పంపిణీ
వనపర్తిలో పేదలకు కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గంలో 16 ,092 పింఛన్లు ఉన్నాయని, కొత్తగా 1,610 మందికి ఇస్తున్నట్లు వివరించారు. అలాగే 153 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.48.51 లక్షల చెక్కులను అందజేశారు.