- రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
ఖమ్మంటౌన్, వెలుగు : రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన బీఆర్‌ఎస్ లీడర్లు.. ఇప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోవడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి ఆమె స్థానిక పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ లీడర్లకు ఖరీఫ్, రబీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో 8 గంటలకు కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని అడగడం జోక్‌గా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రఘునాథపాలెంలోని పీర్లగుట్టను దోచుకుని సాఫ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కావాలని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్లకాలం తమదే పాలన అనుకున్న లీడర్లను.. ఇప్పుడు ప్రజలు కూడా గుర్తు పట్టడం లేదన్నారు. ఓ వైపు బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులను తీరుస్తూ మరో వైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 25 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధిపై మాట్లాడతానని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాధాకిశోర్, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహారా పాల్గొన్నారు.