![కేసీఆర్ కుటుంబీకులు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నరు](https://static.v6velugu.com/uploads/2021/02/revanth-4.jpg)
- మూడు వేల కోట్లతో ప్రగతి భవన్ కడ్తవ్.. పంటలను కొనవా?
- కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
- లక్షల కోట్లు ఖర్చు పెట్టిన్రు.. ఊర్లల్ల రోడ్లు కూడా వేయలె
కల్వకుర్తి, వెలుగు: ‘రాష్ట్రం వచ్చాక లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చివరికి గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేదు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది?’ అని సీఎం కేసీఆర్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రగతిభవన్‌కు రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన సీఎంకు రైతుల పంట కొనడానికి ఇబ్బందేం వచ్చిందని నిలదీశారు. రాజీవ్ రైతు భరోసా యాత్ర మూడో రోజు కల్వకుర్తి మండలం ఎల్లికల్‌లో బుధవారం మొదలైంది. మార్గమధ్యలో తిమ్మరాసిపల్లి గ్రామంలో బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. ‘కేసీఆర్ కుటుంబీకులు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నరు. ముసలివాళ్లు పెన్షన్లు రాక గోస పడుతున్నరు. అధికారులు ఏవేవో సాకులు చెప్పి పెన్షన్లు రాకుండా చేస్తున్నరు’ అని మండిపడ్డారు. ‘ఉద్యోగాల్లేక, వ్యవసాయం గిట్టుబాటు గాక పిల్లలు చెట్టుకొకరు గుట్టకొకరు పోయారు. వాళ్ల ఖర్చులు వాళ్లకే సరిపోతున్నాయి. అలాంటప్పుడు ముసలోళ్లను ఎవరు చూడాలె? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోక పోతే పురుగుల మందైనా ఇచ్చి చంపండి’ అని వృద్ధులు అంటున్నారని రేవంత్ చెప్పారు. వాళ్లు అలా గోస చెప్తుంటే బాధకలిగిందని అన్నారు.
ఎలక్షన్లు వస్తే స్కీమ్‌లు గుర్తొస్తయ్
పాదయాత్ర తర్వాత మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎంపీ మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్కారు మెడలు వంచైనా రైతులు పండించిన పంట కొనిపిస్తామని చెప్పారు. ఎలక్షన్లు వస్తేనే పథకాలు గర్తుకొస్తాయని గమనించిన జనం.. తగిన బుద్ధి చెబుతున్నారన్నారు. సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని రాష్ట్ర ప్రజలను కేసీఆర్ అవమానించారన్నారు.
For More News..