కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపించి.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని వచ్చే వారం మంత్రి పదవి నుంచి తీసేయబోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా బారినపడి జర్నలిస్ట్ మనోజ్ మృతిచెందడంతో జర్నలిస్టుల సంఘం ఆయన కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు.. జర్నలిస్టులందరికీ కరోనా ఇన్సూరెన్స్ మరియు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఉపవాస దీక్షకు దిగింది. ఎంపీ రేవంత్ రెడ్డి దీక్షా శిబిరానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉండే మీడియా ప్రతినిధులకు కరోనా ఇన్సూరెన్స్ కల్పించాలని ఆయన కోరారు.
‘దేశంలో, రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే దూతలు జర్నలిస్టులు. రాష్ట్రంలోని ప్రజలందరి కష్టాలను, బాధలను, నష్టాలను ప్రభుత్వానికి తెలియజేసింది మీడియానే. ఇప్పుడు ఆ మీడియా ప్రతినిధుల పరిస్థిన రోడ్డున పడ్డది. దాంతో వారు కూడా నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులు ఉపవాస దీక్షకు కూర్చున్నారంటే.. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం వైఫల్యం చెందినట్లే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన నచ్చితే నజరానా.. నచ్చకపోతే జురుమాన అన్నట్లు ఉంది. పీవీ సింధు, సానియా మీర్జాలకు కోట్లు ఇచ్చారు కానీ.. కరోనాతో ఒక పాత్రికేయుడు చనిపోతే కనీసం పట్టించుకోలేదు. కరోనా పేషంట్లకు రూ. 3.5 లక్షలు ఖర్చుపెడుతున్నామన్న ప్రభుత్వం.. జర్నలిస్ట్ మనోజ్ కు గాంధీ ఆస్పత్రిలో ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి? గాంధీ ఆస్పత్రిలో సరిపోయేంత సిబ్బంది లేకపోవడం వల్ల డాక్టర్లకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం పీపీఈ కిట్లకు ఎంత ఖర్చు చేసింది.. ఎక్కడ, ఎంతకు కొన్నదో లెక్కచెప్పాలి.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారని ప్రతిపక్షాలను బయటకు రానీయడంలేదు. కోర్టులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిస్తే.. కోర్టులపై గౌరవం ఉందంటారు. అదే వ్యతిరేకంగా తీర్పులొస్తే. . పైకోర్టుకు వెళ్తామంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా వచ్చిందని తెలిసింది. గాంధీలో కరోనా పేషంట్లకు సదుపాయాలు అన్నీ ఉంటే.. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన యాదగిరిరెడ్డి యశోధ హాస్పిటల్ లో ఎందుకు కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో చెప్పాలి. ఒక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితేనే కదా అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలిసేది. ప్రజలు కూడా అదే అంటున్నారు. ఇక గాంధీ డాక్టర్లయితే ప్రజలకు కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్నప్పుడు.. ఎమ్మెల్యేకు చేయలేమా అని అడుగుతున్నారు. మాకు అంత నైపుణ్యం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరో టీఆర్ఎస్ నాయకుడు తనకు ఎదురుతిరిగిన వైద్యారోగ్య శాఖమంత్రి మీద కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నాడు. కరోనా వైఫల్యాల గురించి ఎప్పటికప్పుడు సీఎంకు చేరవేస్తున్నాడు. వచ్చే వారం మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ పదవి ఊడిపోతుంది. కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపించి.. ఈటెలను పదవీచ్యుతున్ని చేయాలని చూస్తున్నారు’ అని ఆయన అన్నారు.
For More News..