ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తామనే నమ్మకం బీజేపీకి లేదని శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దిగార్చేలా ఆ పార్టీ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లోని తన కాలమ్ ‘రోక్‌థోక్’ లో బీజేపీ రాజకీయాలపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ సీఎం, మహారాష్ట్ర పీసీసీ మాజీ చీఫ్ అశోక్ చవాన్ వంటి నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మహారాష్ట్ర ఒకప్పుడు రాజకీయాల్లో ప్రోగ్రెసివ్, మోడర్న్ థాట్స్‌కు బలమైన సపోర్టర్‌గా పేరుగాంచింది.
ఆ ఇమేజ్ పోయి ఇప్పుడు రివర్స్ రాజకీయాలకు పేరుగాంచిన రాష్ట్రంగా మార్చేలా.. రాజకీయ కల్చర్‌ను బీజేపీ దిగజార్చుతున్నది”అని తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య వంటి బీజేపీ నేతలు ఒకప్పుడు చవాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫడ్నవీస్.. చవాన్‌ను ‘డీలర్’ అని పిలిచేవారు. జైలులో పెడతామన్నారు. ఇప్పుడు ఆయన్ను పార్టీలో చేర్చుకొని.. చవాన్ అనుభవాన్ని వాడుకుంటామని అంటున్నారు. మహారాష్ట్ర తో పాటు దేశంలో వారు ఇప్పుడు అనైతిక రాజకీయాలు నడుపుతున్నారు’’ అని ఆయన ఆరోపించారు.