![తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్ల చిచ్చు](https://static.v6velugu.com/uploads/2024/03/mp-seats-war-in-telangana-bjp-party_I5mRlzQ4xU.jpg)
- కొత్త వారికి ఇవ్వడంపై పాతోళ్ల ఆందోళన
- ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీకి మొండిచెయ్యి
- మిగిలిన రెండు సీట్లూ కొత్తవారికే అంటూ ప్రచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో పార్లమెంట్ సీట్ల పంచాయితీ నడుస్తున్నది. ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారికి కాకుండా.. కొత్తగా పార్టీలో చేరిన వారికే సీట్లు కేటాయించడంపై నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలు సీట్ల పంచాయితీ బీజేపీ అధిష్టానం దృష్టికి పోయింది. అయినా, పెద్దగా మార్పులేకపోవడంతో కొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అయితే, కనీసం పెండింగ్‌లో ఉన్న రెండు సీట్లలోనైనా పార్టీ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు బీజేపీ పోటీ చేసే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
దీంట్లో వరంగల్, ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో దింపింది. మొత్తం నలుగురు బీజేపీ ఎంపీలుండగా, ఫస్ట్ లిస్టులో ముగ్గురు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చింది. నలుగురు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. రెండో లిస్టులో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు స్థానంలో గోడెం నగేశ్‌కు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు, అసలు పార్టీ సభ్యత్వం లేని మాధవిలతకు సీట్లు ఎలా ఇస్తారని పార్టీ నేతలనుంచి విమర్శలు వచ్చాయి.
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరగానే, ఆయన కొడుకు భరత్‌కు సీటు అలాట్ చేయడంపై అక్కడి నేతలు గుర్రుగా ఉన్నారు. మరోపక్క మల్కాజ్గిరి సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు మురళీధర్ రావు, కూన శ్రీశైలంగౌడ్, కొమురయ్య, వీరేందర్ గౌడ్ తదితరులు అసంతృప్తిగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రావు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. లిస్టు వచ్చి వారమైనా ఇంకా ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు తగ్గలేదు.
తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు
ఆదిలాబాద్‌లో కొత్తగా చేరిన గోడెం నగేశ్‌కు, నల్గొండలో సైదిరెడ్డికి, మహబూబాబాద్‌లో సీతారాంనాయక్, పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ కు రెండో లిస్టులో సీట్లు కేటాయించడం ఆయా సెగ్మెంట్లలోని సీనియర్ నేతలకు మింగుడుపడటం లేదు. మరోపక్క మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ రెడ్డి ఏకంగా బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన ఖమ్మం సీటు జలగం వెంకట్రావుకు, వరంగల్ సీటు ఆరూరి రమేశ్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.
మరోపక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు సమాచారం లేకుండానే మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ సీటు ఇవ్వొద్దని బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారిని ఆ జిల్లా నేతలు కలిసినా ఫలితం లేకపోయింది. చివరికి బీజేపీ అధిష్టానం ఆయనకే సీటు కట్టబెట్టింది. మరోపక్క వరంగల్ సీటు విషయంలోనూ ఆరూరికి ఇవ్వొద్దని కొందరు నేతలు బీజేపీ అగ్రనేతలను కలిసి, ఫిర్యాదు చేశారు. ఉన్న సీనియర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఆరూరికి కేటాయిస్తే సహకరించబోమని తేల్చిచెప్పారు. మరోపక్క జహీరాబాద్ లో కొత్తవారికి సీట్లు ఇవ్వడంపై అక్కడి నేతలు బీబీపాటిల్ పోస్టర్లను చించేసి నిరసన తెలిపారు. ఈ పంచాయితీలన్నీ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సీటు కేటాయింపు విషయంలో రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీస్టేడియంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్‌గా హాజరైన బూత్ లెవెల్ వలంటీర్ల మీటింగ్ కు హాజరుకాలేదు. అయితే, ఆందోళన చేస్తున్న వారిని రాష్ట్ర అధిష్టానం పిలిచి మాట్లాడిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.