జిల్లాలో ఏడు స్థానాల్లో జెండా ఎగురవేస్తాం : సోయం బాపూరావు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పి పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఎంపీ సోయం బాపూరావు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. కేసీఆర్​అవినీతిని, మోసపూరిత వాగ్ధానాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

సాధారణ ఆదివాసీ బిడ్డను ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఉన్నత స్థానం కల్పించిన బీజేపీని తాము ఎన్నటికీ వదిలిపెట్టేది లేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆదిలాబాద్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తట్టుకోలేక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ఎద్దేవా చేశారు. జడ్పీ మాజీ చైర్​పర్సన్​ సుహాసినీరెడ్డి, నాయకులు బోయర్ విజయ్, మయూర్ చంద్ర, నగేశ్, ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.