ఆదిలాబాద్, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను పిలవాల్సిన అవసరం లేదని ఎంపీ సోయం బాపురావు అన్నారు. గురువారం బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైన ప్రధానమంత్రి వస్తున్నారంటే ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం స్వాగతం పలుకుతారని, కానీ కేసీఆర్ మాత్రం మోడీ వచ్చినప్పుడల్లా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటన నేపథ్యంలో జరిగే సభను జిల్లా ప్రజలు చూసేందుకు పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ వాల్ లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఎరువుల ఫ్యాక్టరీని దేశ రైతన్నకు అంకితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై అధికార, లెఫ్ట్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ కార్యక్రమం చేపట్టినా విమర్శించడం ఆ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. ఆదివాసీలను మోసం చేయడం కూడా కేసీఆర్ కు బాగా అలవాటైందన్నారు. అసెంబ్లీలో పోడు వ్యవసాయం చేసుకొనే గిరిజన రైతులకు పట్టాలిస్తామని ప్రకటించి మాట తప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త నాటకం తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ అధికారాలను ప్రభుత్వం కాలరాస్తోందని పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షడు పాయల్ శంకర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రామన్నకు మునుగోడు ఓటర్లపై ఉన్న మమకారం నియోజకవర్గ ప్రజలపై లేదన్నారు. సాత్నాల గ్రామాలను కలిపే బ్రిడ్జ్ పనులు 2018 లో పూర్తి కావాల్సి ఉండగా నేటికీ మొదలు పెట్టలేదన్నారు. చనాకా కోర్టా 2018లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు చుక్క నీరివ్వలేదని పేర్కొన్నారు. తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే బ్రిడ్జి పనులు శంకుస్థాపనకు నోచుకోవడం లేదని, రిమ్స్ లో పసికూనల ఇక్కట్లు, రోగుల కష్టాలు ఎమ్మెల్యేకు కనిపిస్తలేవు కానీ మునుగోడు అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ డబ్బా కొట్టుకోవడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో ఎస్టీ మహిళా మోర్చ జిల్లా ఇన్చార్జి జానుభాయి, నాయకులు ఆదినాథ్, రమేశ్, వేణుగోపాల్, లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.